వెయ్యి స్థంభాల గుడి - హన్మకొండ

వెయ్యి స్థంభాల గుడి - హన్మకొండ


వరంగల్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోను హనుమకొండ నగరం నడిబొడ్డున వేయి స్తంభాల గుడి అనే ఈ రుద్రేశ్వరాలయం కలదు. ఈ ఆలయం అసలు పేరు రుద్రేశ్వరాలయం. ఈ ఆలయం అనుకోని విడిగా ఒక కళ్యాణ మండపం ఉంది. ఆ మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. అందువల్ల అసలు గుడికే వెయ్యి స్తంభాల గుడి అనే పేరు సార్ధకమైనది. ఈ రుద్రేశ్వరాలయం ప్రోలరాజు, ముప్పమదేవి  ల కుమారుడైన రుద్రదేవ మహారాజు చేత క్రీస్తుశకం 1163 వ సంవత్సరం జనవరి 19 వ తారీఖున ప్రతిష్టింపబడినట్లు ఇక్కడ ఉన్న ఒక శిలాశాశనం మనకు తెలియజేస్తుంది. కాకతీయుల ప్రభావానికి మణికిరీటం ఈ వెయ్యి స్తంభాల దేవాలయం. విశిష్టమైన నిర్మాణ శైలితో కూడిన ఈ దేవాలయాన్ని క్రీస్తుశకం 1138-1145 మధ్య కాలంలో రుద్రదేవుడు నిర్మించాడు. ఆలయ ప్రాంగణంలో నల్ల రాతితో చెక్కిన నంది విగ్రహం నిజమైన వృషభ రాజంలా జీవకళ ఉట్టి పడుతుంది. హనుమకొండ లోని చారిత్రిక శ్రీ రుద్రేశ్వరస్వామి దేవాలయం, వెయ్యి స్తంభాల దేవాలయం కాకతీయుల కళావైభవానికి దర్పణం పడుతుంది. వారి సంస్కృతీ , సంప్రదాయాలకు తార్కాణం గా నిలుస్తుంది. నిత్యం వందలాది మంది భక్తులకు, సందర్శకులకు ఒక ప్రత్యేక సందర్శన ప్రదేశంగా విరాజిల్లుతుంది. రుద్రేశ్వరాలయ ముఖద్వారం పై మనోహరమైన తోరణ శిల్పం ఉంది. దీనితో పాటు నర్తించే శిల్పాలు, రంగ మండప స్తంభాలు , లోపలి కప్పు, ఆలయ రాతిగోడలు, అంతరాలయ ద్వారాలు, అద్భుతమైన శిల్పాలతో ఆకర్షిస్తుంది. త్రికూట ఆలయానికి ముందు భాగం లో నంది విగ్రహం మణికిరీటం గా చెప్పవొచ్చు. ఆలయ పీఠం కూడా నక్షత్ర ఆకృతి త్రికూట ఆలయాల మధ్య నున్నని నల్ల రాతి చెక్కడాలు, వలయకార దర్పణంలా కనపడుతుంది. దాని పై పడిన సూర్య కాంతి గర్భగుడి కి వెలుగు ని ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. కాకతీయ రాజులు ఇక్కడి నుండి తవ్విన సొరంగ మార్గం ద్వారా శ్రీ భద్రకాళి దేవాలయానికి ఖిల్లా వరంగల్ కు , రామప్ప దేవాలయానికి వెళ్లే వారు అని పూర్వికులు చెపుతారు. వెయ్యి స్తంభాల దేవాలయ అవతరణ ఒక చారిత్రాత్మక కధ ఉంది. కాకతీయులు , తెలుగు నేలను పాలిస్తున్న రోజులవి. ప్రోలయరాజు ధర్మ పరిపాలన చేస్తున్న రోజులలో ఆయనకు ఒక మగ బిడ్డ జన్మించాడు. అతని వాల్ల  తండ్రికి మరణం సంభవిస్తుందన్న వార్త జ్యోతిస్యుల ద్వారా తెలుసుకొని అతనిని ఒక బ్రాహ్మణుని వద్ద ఉంచగా , కొంతకాలం తరువాత జ్యోతిస్యులు చెప్పిన విధముగా కొడుకు చేతిలో తండ్రి మరణిస్తాడు. ఆ విధముగా తండ్రి మరణానికి కారకుడైన తనను తాను నిందించుకొని తండ్రి ఆత్మశాంతికి ఈ ఆలయాలను నిర్మించాడు. అంతే కాదు తన రాజ్యంలో నలుమూలల ఇంకా ఎన్నో నిర్మింప చేయించి, కొంత దుఃఖం మును దిగమింగుకొన్నాడు. ఎన్నో సత్కర్మలు ఆచరించాడు. గోవు, భూమీ దానాలు  ఎన్నో చేసాడు. శిల్ప కళ ఆరాధించాడు. కవులను ఆదరించాడు . కాకతీయుల శిల్పకళ శైలితో ఉండే ఈ త్రికూట ఆలయంలో నక్షత్రాకార పీఠం పై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తి గా లింగ రూపంలో కొలువు అయినాడు. ప్రధాన ఆలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళ తో చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఆలయ ముఖ మండపానికి ఉత్తరాది ముఖమై ఉన్న నందీశ్వరుని విగ్రహం నల్ల రాతి తో మలచ బడినది కల్యాణ మండపానికి మరియు ప్రధాన ఆలయాలకు మధ్యన ఠీవిగా దర్శనమిస్తుంది . ఈ ఆలయం మొత్తం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉన్న పునాది మీద నిర్మింపబడింది . ఈ పునాది 31 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో చాల విశాలముగా శ్రీ చక్రం ఆకారంలో నిర్మింపబడ్డది. ఈ ఆలయ నిర్మాణ శైలి కూడా మరెక్కడా లేని విధముగా ఉంటుంది. ఉత్తర ప్రాకారం ద్వారం గుండా ఆలయ ప్రాంగణం లోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానపట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పర్చన చేస్తున్నట్లుగా గాలికి రాలే పువ్వులు సువాసనాలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చుసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు.

ప్రధాన ఆలయం నక్షత్రాకార మండపంపై రుద్రేశ్వరుడు, విష్ణువు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమర లకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. ఈ ఆలయం మధ్యలో విశాలమైన వేదిక వంటి ఖాళి ప్రదేశం ఉండి , ఆ వేదికకు మూడు చివరల మూడు గర్భాలయాలు ఉన్నాయి. నాలుగవ ప్రక్క అంటే దక్షిణం వైపున మాత్రం అవతలాగా ఉన్న కల్యాణ మండపం వైపు వెళ్లేందుకు వరండా వంటి మండపం లో నుంచి మార్గం ఉంది. మధ్యలో ఉన్న వేదికకు మూడు ప్రక్కల ఉన్న గర్భాలయాలలో పడమటివైపు ఉన్నదానిలో ఒక శివలింగ మూర్తి, ఉత్తర వైపు ఉన్న దానిలో వాసు దేవర అనే పేరుతో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం, తూర్పు వైపున ఉన్న దానిలో సూర్యదేవర విగ్రహములు ప్రతిష్టించబడ్డాయి. ఇందులో ప్రస్తుతం సూర్యదేవర విగ్రహమూర్తి లేదు. ఇలా ఒకే వేదిక మీద ముగ్గురు దేవతా మూర్తులకు విడివిడిగా గర్భగుడిలు ఉండేటట్లు నిర్మించడం అపూర్వం. ఈ రకమైన నిర్మాణాన్ని త్రికూటాలయం అంటారు. అంటే మూడు కూటములు కలది అని అర్ధం చెప్పుకోవచ్చు. గర్భగుడిలో ఉన్న రుద్రేశ్వర లింగ విగ్రహమూర్తి ఈ మూర్తి మొత్తము 1. 22 మీటర్ల ఎత్తు తో ఒక తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నట్లు అనిపిస్తుంది. మూడు గర్భాలయాలకు ఉన్న ద్వారా బంధాలు అత్యద్భుతం. సాదారణముగా ఏ ద్వార భందమైన దాని ప్రక్కన ఉన్న గోడ లోకి దూర్చి బిగించబడి ఉంటుంది. కానీ ఇక్కడ ద్వార బంధం గోడ కంటే ఒక అడుగు ముందుకు ఉంటుంది. అంటే గోడకు అంటకుండా ద్వార బంధాన్ని ఒకదాన్ని విడిగా నిలబెట్టినట్లు ఉంటుంది. సుమారు 16 అడుగుల ఎత్తున, 12 అడుగుల వెడల్పు ఉండే ఈ ద్వార బంధం మొత్తము ఒకే రాతిఫలకం. ఇంత పెద్ద శిలాఫలకాన్ని గోడకు అంటకుండా నిలబడి ఉండేటాలు అమర్చబడి చెక్కిన శిల్పుల నిపుణ్యం అమోఘం. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశా  నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో రుద్రేశ్వరున్ని దర్శిస్తారు. మహాన్యాస  పూర్వక రుద్రాభిషేకాలు, బిల్వ అర్చనలు, శతసహస్ర  దీపాలంకరణలు, అన్న రాసితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించి తరిస్తారు.