గోల్డెన్ టెంపుల్ అమృత్సర్
పంజాబ్ రాష్ట్రము, అమృతసర్ జిల్లాలో అంబాలనుండి
సుమారు 180 కిలో మీటర్ల, దూరంలో అమృతసర్ ఉన్నది. ఇది భారత్ - పాకిస్తాన్ సరిహద్దులతో
ఉన్న రాష్ట్రం. సిక్కు మతస్థులతో పాటు, ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకో దగిన కట్టడాలలో
అమృతసర్ లో ఉన్న స్వర్ణ దేవాలయం ఒకటి. సిక్కు మతస్థులకు అమృతసర్ ఒక గొప్ప పవిత్ర పుణ్యక్షేత్రం.
నాల్గొవ సిక్కు మత గురువు రామ్ దాస్ సిక్కు మతాన్ని అభివృద్ధి పరిచేందుకు ఒక సరోవరము,
దానిలో ఆలయము నిర్మించాడు. అయన తరువాత ఐదొవ మత గురువు అర్జున గురువు ఈ ఆలయాన్ని మరింత
తీర్చిదిద్దాడు. సిక్కుల గ్రంథ సాహాబ్ ఉన్న ఈ ఆలయానికి నాలుగువైపులా ద్వారాలున్నాయి.
స్వర్ణమందిర ఆలయం, సరోవరం మధ్యలో ఉంది. ఈ సరోవరం చుట్టూ 38 అడుగుల వెడల్పున గచ్చు చేసిన
దారి ఉంది. దీనిని పరిక్రమ మార్గం అంటారు. అన్ని
ప్రవేశ ద్వారాల వద్ద చెప్పులు పెట్టుకొనేందుకు చాల పెద్ద హాళ్లు ఉన్నాయి. ఇందులో
సేవ పూర్తిగా ఉచితం. ఆలయ కమిటీ వారు నియమించిన ఉద్యోగులే కాక, భక్తులు కూడా ఎంతోమంది
వచ్చి, కొంతసేపు ఉచితంగా సేవచేసి వెళుతుంటారు. ఆలయ ప్రాంగణంలోనికి అంటే బయట నుంచి,
పరిక్రమ మార్గం మీదకు అడుగుపెట్టక ముందే, ఆడవారు తలనిండా వస్త్రం కప్పుకోవాలి. మగవారు
కూడా వస్త్రం గాని, కనీసం జేబురు మాలుగాని తలమీద కప్పుకోవాలి. సరస్సు చుట్టూ ఉన్న భవనాలలో
ఒక దానిని లంగర్ భవనం అంటారు. అంటే భోజనశాల.
ఇందులో ఆలయ దర్శానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఏ సమయములోనైనా ఉచితంగా భోజనం పెడతారు.
సరస్సు మధ్యలో ఉన్న ఆలయంలోకి ప్రవేశించటానికి, సరస్సు ఒడ్డు నుంచి, 20 అడుగుల వెడల్పు
గల వంతెన లాంటి బాట ఉంది. ఈ దారి వద్దకు వెళ్ళడానికి, ఒడ్డున ఒక ఆర్చి వంటి ప్రవేశ
ద్వారం ఉంది. దీనిని దర్శన్ దర్వాజా అంటారు. ఈ దర్శన్ దర్వాజా ముందు భాగం మొత్తము,
లోపల ఉన్న నడవా గోడలు, పైకప్పు మొత్తము, బంగారం
పూత పూసిన రేకు తాపడం చేసి ఉండి, దాని మీద చక్కని నగిషీలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయపు
దర్వాజా తలుపులు, చక్కని దంతపు నగిషీలతో కూర్చబడి ఉన్నాయి. దర్వాజా దగ్గర నుంచి, ఆలయం
వరకు, బాట మీద షామియానా లాంటి చాలా అందమైన కప్పు నిర్మించారు.
సరోవరం మధ్యలో సుమారు 67 అడుగుల చదరంగా ఒక
వేదిక నిర్మించి, దాని మధ్యగా ఆలయం నిర్మించబడ్డది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంది.
క్రింద అంతస్థులో ఒకే ఒక పెద్ద హాలు. ఆ హాలు మధ్యగా, ఆకర్షణీయంగా అలంకరించిన వేదిక
ఒకటి ఉంది. ఆ వేదిక పైన ఉన్న బంగారు సింహాసం మీద పవిత్ర గ్రంథ సాహెబ్ ఉంటుంది. చివరి
గురువు అయిన గోవిందసింగ్ నిర్ణయం చేసినట్టు,సిక్కు మతస్థులకు ఈ గ్రంధమే ఒక గురువు.
ఈ పవిత్ర గ్రంథం మొత్తం 1430 పెద్ద సైజు పేజీలతో ఉంటుంది. ఇందులో 5894 శ్లోకాలు ఉన్నాయి.
ఈ శ్లోకాలను గానం చేయడానికి, ప్రతి శ్లోకానికి
నిర్ణితమైన రాగం ఉంది. గ్రంథ సాహెబ్ ఉన్న పీఠం ప్రక్కనే , వేదిక మీద కూర్చొని శ్లోకాలను
గానం చేస్తూ ఉండే వారిని రాగి అంటారు .
ఉదయం ఆలయం తెరచిన దగ్గర నుంచి రాత్రి ఆలయం
మూసివేసేవరకూ గ్రంథపఠనం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఆలయం ఒడ్డున ఉన్న దర్శన్ దర్వాజాకు
సరిగా ఎదురుగా, సుమారు 20 మీటర్ల దూరంలో 6 అంతస్తులతో ఎత్తుగా ఉన్న భవనం ఒకటి ఉంది. దీని పైన అర్ధగోళాకారపు
డోము వంటి బంగారు పూత పూసిన రేకు తాపడం చేసిన శిఖరం ఉంది. ఈ భవనాన్ని అకల్ తఖ్త్ అంటారు. ప్రతిరోజు రాత్రి పూట గ్రంథ సాహెబ్ ను ఈ అకల్ తఖ్త్ భావన,లో భద్రపరుస్తారు.
ప్రతి రోజు ఉదయం, అకల్ తఖ్త్ నుంచి గ్రంథ సాహెబును, ఒక పల్లకిలో ఉంచి, ఆ పల్లకిని భుజాలమీద
మోస్తూ, ఆలయంలోకి తీసుకువస్తారు. తిరిగి,రాత్రి 10 గంటలకు గ్రంథ సాహెబ్ ను పల్లకిలో
ఉంచి అకల్ తఖ్త్ కు తీసుకు వెళ్తారు. ఈ గ్రంధాన్ని అప్పుడప్పుడు ఊరేగింపుగా ఊరిలోకి తీసుకువెళుతూ ఉంటారు. స్వర్ణ దేవాలయ సరస్సు లోని
జలాలు సిక్కులకు పునర్జన్మ లేకుండా చేస్తాయని, పాపాలన్నీ కడిగివేస్తాయని వారి ప్రగాఢ
విశ్వాసం. గురు గోవింద్ సింగ్ సిక్కులను వీర
సైనికులుగా విజయం సాధించాడు. సిక్కులందరిని
ఇంటి పేరును వదలి వేసి పురుషుల పేరు చివర సింగ్ ను స్త్రీలను తమ పేరు చివరగా
కౌర్ ని చేర్చుకోమన్నాడు. ఆలయ నిర్మాణంలో సుమారు 700 కిలోల బంగారాన్ని వాడారు. సిక్కులే
కాక ఇతర మతస్తులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.
0 Comments