శ్రీ వెంకటేశ్వర స్వామి, ద్వారకా తిరుమల

శ్రీ వెంకటేశ్వర స్వామి, ద్వారకా తిరుమల


పశ్చిమ గోదావరి జిల్లా లోని ద్వారకా తిరుమల అను గ్రామము కలదు. ఈ గ్రామములోని అనంతా చలం అనే కొండ పై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువు తిరి ఉన్నారు. ఈ పుణ్య క్షేత్రం చాలా ప్రాముఖ్యత సంతరించుకొన్నది. స్వయంభువుగా ప్రత్యక్ష మైన శ్రీనివాసుని క్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందినది. దేవాలయానికి ఉత్తర వాహినియై పంపా నది ప్రవహిస్తోంది. అదే నేటి ఎర్ర కాలువ. సప్తర్షుల కోరిక మేరకు, శ్రీ హరి తన సుదర్శన చక్రంతో చక్కని తిర్దాన్ని సృజించాడు. అదే సుదర్శన తీర్థం. కొండ పైన ఆలయం ఉన్న ప్రదేశము సుమారు 2కిలోమీటర్ పొడువునా,బల్ల పరుపుగా, ఉంటుంది. ఈ కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి 2 కిలోమీటర్ దూరంలో,అంటే కొండకు ఉత్తరపు అంచున మల్లికార్జున స్వామి వారి ఆలయం భక్తులకు కాను విందు చేస్తూ ఉంది. తిరుమల తిరుపతి స్వామి వారికీ మ్రొక్కిన మ్రొక్కును  ద్వారకా తిరుమలలో తీర్చుకున్న అదే ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద 2 విగ్రహములు ఉండడం ఇక్కడి విశేషం. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండోవది స్వామి ఒక్క పై భాగము మాత్రమే కనిపించు అర్ద విగ్రహము. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని మైలవరం జమీందారులు కట్టించారు. విమానము, మండపము, గోపురము, ప్రాకారాలను ధర్మ అప్పారావు (1762 -1827) కాలంలో కట్టించునట్లు తెలియచున్నది. బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు రాణి చిన్నమ్మ రావు (1877-1902) సమర్పించారు. పురాణ కాలం నందు ఈ ద్వారకా తిరుమలలో శేషకృతి కల్గిన కొండ పైన ద్వారకుడు అనే ఋషి ఉత్తరాభిముఖంగా కూర్చొని తపస్సు చేయగా, కొంత కాలమునకు ద్వారకా ఋషి ఎదురుగా శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమైనాడు. భక్తుని కోరిక మేరకు స్వామి వారు అచ్చటనే దక్షిణాభి ముఖంగా వెలిసినాడు. ఆనాటి నుండి ఈ క్షేత్రం ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం నందలి స్వయంభువుగా వెలిసిన స్వామి వారి పాదములు  పుట్టలో ఉన్నందు వలన స్వామి వారిని మనము దర్శించలేము. పై భాగము మాత్రమే మనకు దర్శినమిస్తుంది. ఆ కారణం చేత 11వ శతాబ్దంలో విశిష్టా ద్వైత శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి, అందరూ స్వామి పాద పూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి స్వయంవ్యక్త దృవ మూర్తికి వెనుక బాగాన కొంత ఎత్తైన పీఠంపై వైఖాన సాగమం ప్రకారం మరొక నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించారు అని తెలియచున్నది. స్వయంభువుగా వెలిసిన, అర్ద భాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువల్ల మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్టింపబడిన నిలువెత్తు మూర్తిని కొలిచినందు వలన ధర్మార్దకామా  పురుష అర్థములు సమకూరుతాయి అని భక్తుల విశ్వాసం ఈ ఆలయమునకు నాలుగు వైపులా 4  గాలి గోపురాలు  కలవు. ఇక్కడ స్వామి వారికీ అభిషేకములు జరగవు. ఎందువలన అనగా ఒక చిన్న నీటి బొట్టు పడిన స్వామి వారి విగ్రహము క్రింద చీమల పుట్ట ఉన్నది.

ఈ ఆలయం యొక్క సాంప్రదాయము ప్రకారము ప్రతి ఏటా వైశాఖ మరియు ఆశ్వయుజ మాసంలో 2కల్యాణ ఉత్సవములు జరుపుతారు. ఎందువలన అనగా స్వయంభు మూర్తి వైశాఖ మాసంలో దర్శనం ఇచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్టించారు కాబట్టి వారు వెలిసిన మాసాలలో కల్యాణాలు జరుపుతారు. ఆలయ ప్రవేశంలో కల్యాణ మండపం ఉంది. మండపం దాటి మెట్లు ఎక్కే తోలి మెట్టు వద్ద పాదుకా మండపంలో స్వామి వారి పాదాలు ఉన్నాయి. ఈ పాదాలకు నమస్కరించి భక్తులు పైకి ఎక్కుతారు. పైకి వెళ్ళే మెట్ల మార్గంలో రెండు ప్రక్కల దశావతారములు విగ్రహములు ప్రతిష్టింప బడినవి. మెట్లకు తూర్పువైపున అన్నదాన సత్రం, ఆండాళ్ అమ్మవారు, పడమటి వైపు పద్మావతి అమ్మవారు, నిత్య కల్యాణ మండపం ఉన్నాయి. 

ప్రధాన ద్వారం లోపల ఇరు వైపులా, గర్భ గుడికి అభిముఖంగా, ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలు ఉన్నాయి. ద్వారం పై బాగాన సప్తర్షుల విగ్రహాలు ఉన్నాయి. గర్భగుడి  చుట్టూ వున్నా ప్రదక్షిణ  మార్గం వెంట ప్రహరీని ఆనుకొని 12 మంది ఆళ్వారుల ప్రతిమలు  ఉన్నాయి. ప్రదక్షిణా  మార్గంలో దీపారాధన మండపం ఉన్నదీ. ప్రధాన మందిరంలో ఆంజనేయ స్వామి, గరుడ స్వామి ల చిన్న మందిరాలు ఉన్నాయి. గర్భగుడిలో స్వయంభూవుగా  వెలిసిన వెంకటేశ్వర స్వామి  వారు, ప్రతిష్టింప బడిన వేంకేటేశ్వర స్వామి వార్లు  మనకు దర్శనం  ఇస్తారు. ఆ ప్రక్కనే కుడి వైపు అర్ద మండపంలో తూర్పు  ముఖంగా  మంగతాయారు, ఆండాళ్, అమ్మవార్లు  కొలువై ఉన్నారు. శుక్రవారం  ఈ అమ్మవార్లకు విశేష కుంకుమ పూజలు జరుగుతాయి. ప్రధాన ఆలయానికి తూర్పు వైపున యాగ శాల, వాహన శాల, మహా నివేదన శాల, పడమటి వైపున తిరువంటపడి పరికరాల శాల ఉన్నాయి. పడమర వైపున ప్రక్కనే తల నీలాలు సమర్పించుకొనే  కల్యాణ కట్ట ఉన్నది. కల్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది  విగ్రహం ఉన్నాయి. ద్వారకా తిరుమల గ్రామం పశ్చిమ వైపు ఇక్కడ చక్రతీర్థము, రామ తీర్థము అనే రెండు స్నాన ఘట్టాలు ఉన్నాయి. 1999లో పుష్కరిణి  మధ్య మండపం నిర్మించారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ  ద్వాదశి  నాడు  తెప్పోత్సవం  జరుపుతారు. ఇచ్చట వైష్టవ అర్చకులు అర్చన చేయుదురు. ప్రతి నిత్యం తెల్లవారి నాలుగు గంటలు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికీ వివిధ రకాల సేవలు జరుగుతాయి. దేవాలయం తలుపులు మధ్యాహ్నం  12:30 నుండి 3 గంటల వరకు మూసి స్వామి వారి దర్శనానికి విరామం ఇస్తారు. అర్చనలు ప్రత్యేక పూజలే కాక, ప్రతి శుక్రవారం, శనివారములు, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి తిధిలు, ఆళ్వారుల  జన్మ తారల యందు. శ్రీ కృష్ణష్టామి, శ్రీ రామనవమి, ఉగాది, సంక్రాంతి, ధనుర్ మాసములందు  విశేష ఉత్సవములు అతి వైభవంగా జరుగుతాయి. స్వామి వారికీ ఆశ్వీజ  మాసంలోను, వైశాఖ మాసంలోను తిరు కళ్యాణములు ఘనంగా జరుగుతాయి. ముక్కోటి ఏకాదశి నాడు స్వామి వారి నిజ రూప దర్శనము  భక్తులకు లభ్యం అవుతుంది. నాడు స్వామి వారి అలంకారములు తొలగించి,  తిరువంజన సేవ జరుపుతారు. ఈ సమయంలో భక్తుల రద్దీ అధికం.