బృందావనం
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర నుంచి సుమారు
9కిలోమీటర్లు దూరంలో బృందావనం ఉంది. బృందావనం ప్రస్తుతం ఒక చిన్న పట్టణం. యమునా నది
తీరాన గల ఈ క్షేత్రము శ్రీ కృష్ణుడు గోపికలతో రాస లీలలు గావించిన స్థలముగా, రాధా కృష్ణుల
ప్రణయానికి వేదికగా వర్ణించబడినది. ఇక్కడ ఇంటింటా కృష్ణ భక్తి, స్థానికుల పలకరింపుల్లో
కూడా రాధే శ్యామ్ స్మరణ వినిపిస్తుంది. ఈ పుర వీధులలో శ్రీ ఛైతన్య మహాప్రభు నృత్యము
చేశాడు. మీరా భాయ్, సూరదాసు మొదలగు వారు భక్తితో గీతాలు ఆలకించారు. ఈ బృందావనాన్ని
ఎంత చుసిన ఇంకా చూడాలని అనిపిస్తుంది. ఈ బృందావనం లో నెమళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఈ బృందావనం
నిండా మందిరాలు ఉన్నాయి. ప్రక్కనే ఉన్న యమునా నది ఒడ్డున 32 స్నాన ఘట్టాలు, ప్రధానంగా
చూడవలసిన ఆలయాలు సుమారు 7 ఆలయాలు ఉన్నాయి.
రంగాజీ ఆలయం: ఇది చాలా పురాతనమైన ఆలయం. రామానుజాచార్య ప్రబోధించిన
విశిష్టా ద్వైత శాఖకు సంబందించిన ఆలయం. అందువల్ల పూర్తిగా దక్షిణ దేశ ఆలయం నిర్మాణ
శైలికి అనుగుణంగా ఈ ఆలయం నిర్మింపబడింది. ఈ ఆలయంలో బంగారు పూత పూసిన రేకులు తాపడం చేసిన
ధ్వజ స్తంభం ఉంది.
గోవిందా దేవ్ జీ ఆలయం: ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. దీనిని క్రీస్తుశకం
1590 సంవత్సరంలో చైతన్య ప్రభు సంప్రదాయానికి
చెందిన రూప, సనాతన అనే ఇద్దరు గురువుల ఆదేశం మేరకు జయపూర్ మహారాజు చే నిర్మించబడినది.
భారత దేశంలో ఉన్న గొప్ప ఆలయాలలో గోవిందా దేవ్ జీ ఆలయం కూడా ఒకటని తెలుస్తుంది. ఈ ఆలయాన్ని
ఎంతో మంది విదేశీయులు కూడా ప్రశంసించారు. ఇది ఎర్ర సున్నపు రాతితో మూడు అంతస్తులుగా
నిర్మింపబడినది. ఎర్ర రాతితో 7 అంతస్తులతో ఉన్న ఆనాటి మందిరం మొగలాయిలా కాలంలో ధ్వంసం చేయబడింది. ప్రస్తుతం మూడు
అంతస్తులతో మాత్రం దర్శనం ఇస్తుంది.
పాగల్ బాబా ఆలయం : ఇది ఒక అద్భుతంగా నిర్మించిన
ఆలయం. క్రింద నుండి పై వరకు ఒక చిన్న కొండ శిఖరం వలె కనిపిస్తూ ఉండి, 10 అంతస్తులతో ఉన్న ఒక గొప్ప సుందరమైన నిర్మాణం. ఈ ఆలయంలో ప్రతి
అంతస్తులోనూ, చుట్టూ ఉన్న గోడలకు ఇనుప జల్లెడ
తో గదులు గదులుగా నిర్మించారు. ఈ గదులలో వరుసగా, రామాయణ, భారత, భాగవత కథల లోని సంఘటనలు,
సన్నివేశాలను చూపిస్తూ విద్యుత్ శక్తి ద్వారా కదిలే బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ బొమ్మలు కదులుతూ, ఆ
సన్నివేశానికి సంబంధించిన అంశాన్ని అభినయిస్తూ
చూపరులను ఆకట్టుకుంటాయి. ఒక్కొక్క అంతస్తులో,
ఒక్కొక్క ఇతిహాసానికో, పురాణానికో సంబందించిన
దృశ్యాలు ఈ కదిలే బొమ్మలు మనకు చూపిస్తాయి.
నిధి వనం: ఈ బృందావన క్షేత్రంలో నిధి వనం సుమారు 5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నది.
తులసీ వనంగా ప్రసిద్ధి చెందిన ఈ నిధి వనం కాళింది నది తీరాన ఉన్నది. ప్రతిరోజు ఈ ప్రాంతంలో
రాత్రి వేళల్లో రాధా కృష్ణులు ఇప్పటికి విహరిస్తూ
ఉంటారని స్థానికుల నమ్మకం. అందుకే ఆ సమయంలో ఈ ప్రాంతానికి ఎవరూ వెళ్ళరు.
రాధా కృష్ణులు రాస లీలలు ప్రదర్శించిన స్థలంగా భక్తులు ఇచ్చటి మట్టిని భక్తి
శ్రద్దల తో తీసుకు వెళతారు. ముక్తి వనంగా పిలవబడే నిది వనంలో రాధా దేవి శృంగార గృహం
రమణీయంగా నిర్మించబడింది.
బన్ కీ బిహారి మందిర్ : ఈ మందిరం లోని మూల
విరాట్టు వన విహారిగా పిలవబడుతున్నాడు. ఈ ఆలయం 1864 లో నిర్మించబడింది. ప్రఖ్యాత గాయకుడు,
తాన్ సేన్ గురువైన సంత్ హరిదాస్ అను కృష్ణ భక్తుడు తన గాన
మాధుర్యానికి కృష్ణ విగ్రహము భూమిలో నుండి
పైకి వచ్చింది అని అంటారు. ఈయన సమాధి కూడా నిది వనంలో నే ఉంది. దీనిని కూడా భక్తులు
దర్శిస్తారు.
రాధా రాణి మందిర్ : ముక్తి వనం మధ్యలో గల
ఈ మందిరం చాలా ప్రసిద్ధి చెందినది. ఒకసారి శ్రీ కృష్ణుడు మౌనంగా ఉండి, తనతో
ఏమి మాట్లాడుట లేదని రాధా దేవీ అతని మురళిని
దాచిన స్థలంలోనే ఈ మందిరం నిర్మించబడినట్లు తెలియుచున్నది. మీరాబాయి మందిరం, శ్రీ రాధా
గోవింద మందిరం, గోపేశ్వర మందిరం, శ్రీ లాలా బాబూ మందిరం, శ్రీ కృష్ణ బలరామ్ మందిరం,
కాళీయమర్దన ఘాట్, యమునా నదీ తీరాన గల స్నాన ఘట్టములు, రాధా రమణ మందిరం, బ్రహ్మ చారి
మందిర్, సీశ్ మందిర్, టీకారియా మందిర్, గోవిందజీ,
గోపనాద జీ, రాధా వల్లభ జీ , మదన్ మోహన్ జీ, అష్ట సఖి, జయపూర్ మందిర్, ఆనంద మయీ మందిర్, చీర్ ఘాట్, విధవా భజన
ఆశ్రమం సందర్శించ దగినవి. బృందావన యాత్ర లో
చౌరాసికోశ్ పరిక్రమగా పిలవబడే 60 కిలో
మీటర్ల, దూరాన్ని చుట్టి చేసే ప్రదక్షిణ చాలా ప్రధానమైనది అని భక్తులు భావిస్తారు.

0 Comments